సర్వాధికారికి శిరస్సువంచే సేవ

Saturday, May 25, 2024

“అయితే యేసు వారియొద్దకు వచ్చి– పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి యున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి”
— మత్త .28:18-19

ప్రభువు తన సంఘానికి ఇచ్చిన చిట్టచివరి ఆజ్ఞ, అంతిమ బాధ్యత—సర్వ మానవాళికి సువార్త ప్రకటించడం! సువార్త సర్వ జనావళికి లేక “సమస్త జనులకు” (మత్త.28.19) లేక “సర్వ సృష్టికి” (మార్కు 16.15) ఎందుకు ప్రకటించాలి? అది క్రైస్తవులకే ఎందుకు పరిమితం కాదు?

ప్రభువు సర్వ జనాన్ని సువార్తీకరించండి అని అదేశించక ముందు తన సర్వాధిపత్యం గురించి మాట్లాడుతున్నారు (18వ.). పందొమ్మిదో వచనం “కాబట్టి” అన్న పద బంధంతో ఆరంభమవుతోంది. మరో విధంగా చెప్పాలంటే, “నేను సర్వాధిపతిని కాబట్టి సర్వ జనులకు సువార్త చెప్పండి” అంటున్నారు ప్రభువు. ఇదే మన ధైర్యం, అధికారం కూడా. ఆయన సర్వాధికారం క్రింద మనం సర్వజనానికి సువార్త చెప్తున్నాం. ఆనాడు యూదుల చట్టసభ “మీరు యేసు నామాన్ని ఏ మాత్రం ప్రకటించ కూడదు” అని ఆదేశించినప్పుడు అపోస్తలులు “మీ మాట వినాలా? దేవుడి మాట వినాలా?. ఏది న్యాయమో మీరే చెప్పండి!” అన్నారు (అపో.4.19). క్రీస్తు అధికారం లోకంలోని సర్వ అధికారాలకు మించినది (ఎఫెసి 1.20). క్రీస్తే సర్వాధికారి. సర్వ మానవాళికి సువార్త చెప్పడం ఆయన మనకిచ్చిన ఆదేశం. అందుకే సువార్త చెప్పడం క్రైస్తవులందరికీ శిలా శాసనం!

“యేసు క్రీస్తు అందరికీ ప్రభువు” (అపో.10.36). ఈ సత్యాన్ని ఆదిమ శతాబ్దంలో అపోస్తలులు ప్రకటించే నాటికి సీజర్ ప్రపంచాన్ని పాలించే ప్రభువు. అంచేత మరింకెవరినైనా ప్రభువుగా ప్రకటిస్తే అది ఆనాడు నేరం, రాజద్రోహం! అయినా ఆదిమ క్రైస్తవులు ప్రాణాలకు తెగించి క్రీస్తును ప్రభువుగా “స్వీకరించారు”, అందరికీ ఆయన్ను ప్రభువుగా “ప్రకటించారు”. పౌలు సీజరు ముందు క్రీస్తును “ప్రభువు”గా ప్రకటించడం వల్లనే అతనికి మరణ శిక్ష విధించారు!

క్రీస్తు క్రైస్తవులకు ఒక్కరికే ప్రభువూ, దేవుడూ ఐతే మనం సర్వ జనులకు సువార్త ప్రకటించాల్సిన పనిలేదు. క్రీస్తు దేవుడైతే ఆయన అందరికీ దేవుడే. క్రీస్తు దేవుడు కాకపోతే ఆయన ఎవ్వరికీ దేవుడు కాదు—క్రైస్తవులకు కూడా! ఐతే మరణాన్ని గెల్చి క్రీస్తు దేవుడని మహా ప్రభావంతో నిరూపించుకున్నాడు (రోమా 1.5). అంచేత ఆయన అందరికీ దేవుడు, ప్రభువు. దేవుడు అనంతుడు కనుక ఒక్కడే ఉంటాడు! కులానికో దేవుడు, మతానికో దేవుడు, దేశానికో దేవుడు, కాలానికో దేవుడు, ఇంటికో దేవుడు ఉండడు. దేవుడు అందరికీ దేవుడు. ఆయన ఒక్కడే. ఆయనే క్రీస్తు!(1 తిమో.2.5)

ఇదే సువార్త! క్రీస్తు ఔన్నత్యాన్ని, విశిష్టతను చాటడమే సువార్త. క్రీస్తు ప్రభుత్వాన్ని, ప్రత్యేకతను చాటనిది సువార్త కానే కాదు. ఆయన ప్రత్యేకతే సువార్త పరిచర్యకు స్ఫూర్తినిస్తుంది. ఆయన ప్రభుత్వమే సువార్త సేవకు అధికారమిస్తుంది.

ఐతే ఇది బలవంత పెట్టే సువార్త కాదు. ప్రేమతో చెప్పే సువార్త. క్రీస్తు సిలువ ప్రేమ సువార్తికుడ్ని బలవంత పెడుతుందే తప్ప సువార్త వినేవారిని బలవంత పెట్టదు (2 కోరిం.5.14). ప్రేమతో చెప్పని సువార్త ఇతరులకు ప్రభువును తప్పుగా చూపిస్తుంది. ప్రభువును ప్రేమించే వాడు ప్రజల్ని ప్రేమిస్తాడు. క్రైస్తవుల్ని, కులస్తుల్ని, సంఘస్తుల్ని మాత్రమే ప్రేమించడు. ప్రజలందరినీ సమానంగా ప్రేమిస్తాడు. ఎందుకంటే క్రీస్తు ప్రజలందరి కోసం సిలువలో ప్రాయశ్చిత్తం చేశాడు (1 యోహాను 2.2; యోహాను 1.29). ఆయన అందరి ప్రభువు. అందరి రక్షకుడు. అందరి దేవుడు. ఆయన్ని అందరికీ ప్రేమతో పరిచయం చేయాలి!

క్రీస్తు సర్వాధిపతి ఐతే ఆయన ఆదేశాల్ని పాటించాల్సిందే. సర్వ జనావళికి సువార్త చెప్పడం ఆయన మనకిచ్చిన ఆదేశం. అంచేత సువార్త చెప్పడం మనం తప్పించుకోలేని అంతిమ బాధ్యత. క్రీస్తు సిలువ ప్రేమ మనల్ని ప్రభావితం చేస్తే, మనలో నుంచి ఆ ప్రేమ ప్రవహిస్తే మనం ఈ బాధ్యతను సునాయాసంగా పూరిస్తాం. ప్రేమ ఆజ్ఞల్ని భారం లేకుండా చేస్తుంది (1 యోహాను 5.3). ప్రేమ లేకపోతే బాధ్యత భారమవుతుంది. ప్రేమ బాధ్యతను భాగంగా మారుస్తుంది. క్రీస్తును ప్రేమించే వాళ్ళు క్రీస్తు సర్వాధిపత్యానికి తలవంచుతారు!

—జీపీ