స్నేహించే దేవుడు!

Wednesday, May 29, 2024

“…ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను…”
— యోహా. 15.15

“సృష్టిలో తీయనిది స్నేహమేనోయి. అది లేని జీవితం వ్యర్థమేనోయి” అన్నాడో కవి. మనిషితో మనిషి స్నేహం అంత తీయనిది ఐతే సాక్షాత్తూ దేవుడే మనిషితో స్నేహం చేస్తే అది ఇంకెంత తీయనిది! ఆ జీవితం ఇంకెంత సార్థకమైంది!

మనిషిని సృష్టించింది మొదలు దేవుడతనితో స్నేహం చెయ్యడానికి ఉవ్విలూరుతూనే ఉన్నాడు. ఏదెను వనంలో ఆదాముహవ్వల్ని చల్లపూట దేవుడు కలుస్తుండే వాడు (ఆది.3.8). దేవుడు హనోకుతో స్నేహించడం మనకు తెలుసు (ఆది.5.24). నోవహుతోనూ దేవుని స్నేహం కొనసాగింది (ఆది.6.9). దేవుడు అబ్రాహాముతో ఎలా స్నేహించాడో మనకు తెలియనిది కాదు (ఆది.18.17; యెష.41.8; యాకో.2.23). ఆయన మోషేతోనూ స్నేహం చేశాడు (నిర్గ.33.11). ఆ తర్వాత తాను తన ప్రజల మధ్య నివసించడానికి తనకొక పవిత్ర స్థలం నిర్మించమని దేవుడు మోషేకు ఆదేశించడం మనకు తెలుసు (నిర్గ.25.8). ఆ తర్వాత అనేక మార్లు ఇజ్రాయేల్ ప్రజలు తమ దేవుడ్ని తిరస్కరించారు. ఐనా ఆయన వారితో స్నేహించాలని తపన పడ్డాడు. దేవుడు హోషేయాతో చెప్పిన మాటల్లో స్నేహించే ఆయన గుండె చప్పుడు వినబడుతుంది. “మహా యెండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే…..వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును” (హోషే.13.5; 14:4).

తాను సృష్టించిన మనిషి తనను ధిక్కరించి, పాపంతో నాశనమైపోతుంటే అతడ్ని వెతుక్కుంటూ వచ్చి, ప్రాణమిచ్చి, దైవ మానవ స్నేహానికి మళ్ళీ నాంది పలికాడు దేవుడు. సిలువలో మనకు దేవునికి మధ్య సంధి చేశాడు క్రీస్తు (కొల.1.19-20). అలా తనకు మించిన స్నేహితుడు లేనే లేడని నిరూపించుకున్నాడు (యోహా.15.13). పరమ పావనుడు పాపుల మధ్య నివసించి (యోహా.1.14), చివరికి “పాపుల స్నేహితుడు” అని ముద్ర వేయించుకున్నాడు (మత్త.9.11; 11.19). ఇటువంటి స్నేహించే దేవుడ్ని విడిచి నేటి క్రైస్తవ తరం లోకంతో స్నేహించడానికే ఎక్కువ మొగ్గు చూపడం శోచనీయం(యాకో.4.4,5; 1 యోహా.2.15-17; 2 తిమో.4.10). మీరు లోక సంబంధులు కారు. మీరు నా స్నేహితులు—అంటున్నాడు ప్రభువు (యోహా.15.19).

నేటి క్రైస్తవ నాయకుల్లాంటి వాడు కాదు మన ప్రభువు. ఆయన తన శిష్యుల్ని సైతం “మీరు దాసులు కాదు. నా స్నేహితులు” అంటున్నాడాయన(యోహా.15.15). ఇదీ ప్రభువు మనస్సు. ఆయన మనతో స్నేహించాలని తపిస్తున్నాడు. ఏదెను వనంలో తెగిపోయిన స్నేహబంధం క్రీస్తులో మళ్ళీ నెలకొంది. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఆయన మనతో స్నేహించడానికి తపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడైతే ఆయన తన ఆత్మ ద్వారా మనతోనే కాదు, మనలో వసియించడానికి ఇష్ట పడ్డాడు. ప్రశ్న ఏమిటంటే—మనం ఆయనతో స్నేహించడానికి ఎంత తపిస్తున్నాం అన్నదే!

క్షణం తీరికలేని బిజీ ప్రపంచంలో పరుగులు తీసే మనం మన జీవితాల్లో దేవుడికిచ్చే టైమ్ ఎంత? అదేంటో గానీ మనకి అన్నిటికీ టైమ్ ఉంటుంది—ఒక్క దేవుడికి తప్ప! ప్రభువుతో గడపని వాడు ప్రభువుని ప్రేమించని వాడే! ప్రభువును ప్రేమించే వాడు ప్రభువుతో గడపకుండా ఉండలేడు! ప్రభువుతో గడపనివాడు ప్రభువును ఎరగలేడు. ప్రభువును ఎరగనివాడు ప్రభువును ప్రేమించలేడు. ప్రభువును ఎరిగినవాడు ఆయన్ని ప్రేమించకుండా ఉండలేడు. ప్రేమించే వాడు స్నేహిస్తాడు. స్నేహించేవాడు సమయం ఇచ్చి తీరుతాడు. స్నేహించని వాడు ప్రభువు మనసును తెలుసుకోలేడు (యోహా.15.15b; ఆది.18.17), ప్రభువు మాటను పాటించలేడు (యోహా.15.14). ఆయనను పాటించే వాడ్ని ఆయన ప్రేమిస్తాడు, వాడితో వసియిస్తాడు (యోహా.14.23).

స్నేహంలో ఒక విచిత్రం ఉంది. మనం ఎవరితో స్నేహిస్తామో వారిలా తయారవుతాం. లోకంతో స్నేహించే వాడు లోకస్తుడిగానే బ్రతుకుతాడు. క్రీస్తుతో స్నేహించే వాడు క్రీస్తులానే బ్రతుకుతాడు. క్రీస్తుతో స్నేహించని వాడు అపవాదిని ఎదిరించ లేడు, పాపాన్ని జయించ లేడు (యాకో.4.4,7,8). క్రీస్తుతో స్నేహించని వాడు క్రైస్తవ జీవితాన్ని ఆస్వాదించ లేడు. క్రీస్తుతో స్నేహించని వాడు లోకానికి క్రీస్తును పరిచయం చేయలేడు. క్రీస్తే కీలకం!

—జీపీ