స్వీయ చిత్రం!

Saturday, June 1, 2024

“తన్ను తాను ఎంచుకొన తగినదాని కంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధి గలవా డగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.”
— రోమా12:3

ఈ ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన ప్రశ్నల్లో ఒకటి”నేనెవరిని?” అన్నది. నేడు కార్పొరేట్ ఉద్యోగాల్లో కూడా ఇంటర్వ్యూల్లో అడిగే మొదటి ప్రశ్న ఇదే. “ఓ మనిషీ, నిన్ను నీవు తెలుసుకో” అన్నారు ప్రాచీన తాత్వికులు. ఐతే మన ఆసక్తి వేరు. మనం మనల్ని తెలుసుకోవడం వదిలేసి పక్కింటి వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. పక్కవాళ్ళ జీవితాల్లోకి తొంగిచూడటం చాలా మందికి సరదా. ఇపుడు సోషల్ మీడియా నిండా ఇదే కంటెంట్! వాళ్లేమిటి? వీళ్లేమిటి? వాళ్ళ బతుకులేంటి? వీళ్ళ బతుకులేంటి? ఇదే ధ్యాస!

సరే, మన గురించి మనం ఒకవేళ ఆలోచించినా అప్పుడు కూడా ఒక్కటే ధ్యాస. అవతలి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో అన్నదే ప్రశ్న! ప్రఖ్యాత రచయిత రాబర్ట్ షుల్లర్ ఈ సమస్య గురించి అద్భుతంగా చెప్పాడు. “నేను నా గురించి ఏమనుకుంటున్నానో అది ప్రాముఖ్యం కాదు. ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారో అదీ ప్రాముఖ్యం కాదు. ఇతరులు నా గురించి ఏమనుకుంటారో అని నేననుకుంటానో అదే ప్రాముఖ్యం” అని చమత్కరిస్తూనే చెప్పాల్సింది చెప్పేశారాయన. ఇది నిజం!

మనం దాదాపుగా ఇతరుల (చుట్టూ ఉన్న సమాజం) స్పృహలో జీవిస్తాం. మన ఆలోచనలు ఇతరుల చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నపుడు మనల్ని మనం వాళ్ళ కళ్ళద్దాల్లోంచి చూసుకోవడం సహజం. ఇది మనకు అలవాటైపోయింది కూడా. ఐతే ఇతరులు మన గురించి ఏమనుకుంటారో కూడా మనకు తెలీదు, వాళ్ళు మనకు చెప్పరు కూడా. మన దేశంలో మొహమాటం ఎక్కువ. అంతేకాదు, ఇతరులు మన “లోపలి మనిషి” గురించిన సరైన చిత్రం ఇవ్వలేరు. ఒక మనిషి మరో మనిషిని పూర్తిగా అర్థం చేసుకోవడం జరగని పని. మనుషులు పైరూపాన్నే చూస్తారని వాక్యం చెబుతోంది (1 సమూ.16.7).

మరి మనల్ని మనకు ఉన్నదున్నట్టు చూపించే అద్దం ఎక్కడ దొరుకుతుంది? మన అంతర్గత స్వీయ చిత్రాన్ని మనకు యథాతథంగా పరిచయం చేసేవారు ఎవరైనా ఉన్నారా? మనిషిని సృష్టించిన దేవుడు తప్ప మనల్ని మనకు ఉన్నదున్నట్టు పరిచయం చేయగల వారెవరూ లేరు. మన స్వీయ చిత్రాన్ని మనకు సుస్పష్టంగా చూపించేది ఆయన వాక్యమే. ఆయనే మన సృష్టికర్త (ఆది.1.26-27; మలా.2.10; ప్రసం.12.2; అపో.17.26). తల్లి గర్భంలో మనల్ని నిర్మించిన దేవుడు ఆయనే. మనం గర్భాన పిండంగా ఉన్నపుడే మనమేంటో ఆయనకు తెలుసు. అప్పుడే ఆయన కన్నులు మనల్ని చూశాయి. మన అంతః స్వరూపాన్ని కూడా ఆయనే నిర్మించాడు(కీర్త.139.13,16). అంచేత మన గురించి దేవుడికి తెలిసినంత మరెవ్వరికీ తెలియదు, మనక్కూడా తెలియదు (కీర్త.139.1-6).

సరైన స్వీయ చిత్రం సరైన ఆత్మ విశ్వాసాన్నిస్తుంది. మనల్ని మనం ఎప్పుడైతే సరిగా అర్థం చేసుకోలేమో మన ఆత్మ విశ్వాసం న్యూనతా భావంగానో, అహంభావంగానో పరిణమిస్తుంది. ఆత్మన్యూనత మనల్ని పనికిమాలినవారిగా మార్చేస్తే, అతిశయం మనల్ని నాశనం చేస్తుంది. భక్త పౌలు మాటలు వినండి. దేవుడు మీకు ఎంత ఇచ్చాడో దాని ప్రకారం మిమ్మల్ని మీరు సరిగా అంచనా వేసుకోండి. ఎక్కువగా ఊహించుకోకండి—అంటున్నాడు అపొస్తలుడు (రోమా 12.3).

అతడెవడైనా సరే, పుట్టిన ప్రతి మనిషీ దేవుని పోలికే. పాపం ఆ పోలికను పాడుచేసినా సరే అతడింకా దేవుని పోలికే (ఆది.9.6; యాకో.3.9). కనుక ఏ మనిషీ పనికిమాలినవాడు కాదు. మనం దేవుని సృష్టి. దేవుని చేతిపని పనికిమాలిన పని కానేరదు! మనమంతా సమర్థులమే. ఎవరూ చేతకాని వాళ్ళం కాదు. ఏదో ఒకటి సాధించే సత్తా మనందరిలో ఉంది. అయితే అందరిలో ఒకే రకమైన సత్తా ఉండదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక సామర్థ్యాన్ని ఇస్తాడు. అందరం దేవుని పోలికలమే. కానీ, మనలో ఎవ్వరికీ ఒకే పోలిక ఉండదు. ఇదే దేవుని సృష్టి సౌందర్యం!

విశ్వాసుల్లోనూ ఇది సత్యమే. మనం మారుమనస్సు పొందినప్పుడు దేవుడు తన ఆత్మతో పాటు మనకు ఆత్మ వరాలనూ ఇస్తాడు(రోమా 8.15,16; 2 కొరిం.5.5; 1 కొరిం.12.11). ఆత్మ వరమంటే సామర్థ్యం. తన పరిచర్య చేయడానికి దేవుడు మనకిచ్చే ఆత్మ సామర్థ్యం. దేవుడు విశ్వాసులందరికీ ఆత్మ వరాలనిస్తాడు. వరం పొందని విశ్వాసి ఒక్కడూ ఉండడు. ఏ ఒక్కనికీ దేవుడు అన్ని వరాలనూ ఇవ్వడు. అలాగని ఏ ఒక్క వరాన్నీ అందరికీ ఇవ్వడాయన(రోమా 12.3-6; 1 కొరిం.12.7,11; ఎఫె.4.7).

అంచేత మనమందరం సత్తా ఉన్నవాళ్ళమే, మనలో చేతకాని వాళ్లంటూ లేరు. “నాకంత సీన్ లేదు” అని ఎవ్వరూ అనుకోడానికి వీల్లేదు. ఐతే నా “ప్రత్యేకత” ఏమిటి అని తెలుసుకోవడమే ఇక్కడ కీలకం. ఎప్పుడైతే వాక్యం కళ్లద్దాలు వేసుకుని మనల్ని మనం చదువుకుంటామో మన స్వీయ చిత్రం మనకు అర్థమవుతుంది. తల్లి కడుపున పుట్టినప్పుడు దేవుడిచ్చిన సహజ సామర్థ్యాన్ని, క్రీస్తులో మనం మళ్ళీ పుట్టినప్పుడు ఆయనిచ్చిన ఆత్మ సామర్థ్యాన్ని మనం తెలుసుకున్నపుడు ఈ స్వీయ చిత్రం మరింత బాగా మనకు అవగతమవుతుంది. మనం ఎవరమో, ఎందుకు పుట్టామో, ఈ భూమ్మీద దేవుని కోసం ఏం సాధించాలో వాక్యం వెలుగులో అవలోకనం చేసుకోవడమే మన స్వీయ చిత్రం!

వాక్యం ఒంటబట్టించుకోవడం వల్ల ఏర్పడ్డ స్వస్థబుద్ధి మనకు సరైన స్వీయ చిత్రాన్నిస్తుంది (రోమా 12.3). ఆరోగ్యకరమైన ఈ స్వీయ చిత్రమే మనల్ని అతిశయం నుంచీ, ఆత్మ న్యూనత నుంచీ రక్షిస్తుంది. ఈ స్వీయ చిత్రమే ఎదుటి వారిని దేవుని పోలికలుగా గౌరవించడానికి, తోటి వారిని మనతో సమానులుగా చూడటానికి మనకు దోహదం చేస్తుంది. ఈ స్వీయ చిత్రమే సంఘటితమైన క్రైస్తవ సహవాసానికి తోడ్పడుతుంది. ఈ స్వీయ చిత్రమే దాంపత్యంలో అన్యోన్యతకు ఆలవాలమవుతుంది. ఈ స్వీయ చిత్రమే మనం దేవుని కోసం, దేవుడు నిర్దేశించిన గొప్ప కార్యాలు సాధించడానికి స్ఫూర్తినిస్తుంది (ఎఫె.2.10). సంఘ పరిచర్యకూ, క్రైస్తవ జీవనానికీ, జీవన సాఫల్యానికీ, ఆత్మ సంతృప్తికీ వాక్యానుసారమైన స్వీయ చిత్రం ఉండటం మనందరికీ అవసరం!

—జీపీ