క్రైస్తవ విమర్శ
అసలు విమర్శించడమే తప్పు అన్నది కొందరి అభిప్రాయం. “మీరు విమర్శించకండి బ్రదర్!” అని చెప్తుంటారు కొందరు. “విమర్శించకండి…ఎందుకు విమర్శిస్తారు” అనడం కూడా విమర్శనే! విమర్శ అంటే లోతైన ఆలోచన, విశ్లేషణ, పరిశీలన, పరీక్ష, పరిశోధన,… ఇవీ అర్థాలు. అందువల్లనే పునర్విమర్శ, సద్విమర్శ, ఆత్మ విమర్శ, పూర్వ విమర్శ వంటి పదాలు ఎప్పట్నుంచో తెలుగులో వాడుకలో ఉన్నాయి. మానవ జీవితంలో విమర్శ అనివార్యం—అది పర విమర్శ ఐనా, ఆత్మ విమర్శ ఐనా! క్రైస్తవంలో ఇది మరింత సత్యం!
నాటి బైబిల్ నేటికీ…
ఎపుడో రాసిన బైబిల్ ఇపుడు నాకు ఎలా వర్తిస్తుంది? నాటి బైబిల్ కాల పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు! నాటి మహిళలు ఇంటి పట్టున ఉండేవారు, ఉద్యోగాలు చేసేవారు కాదు. నేటి మహిళలు అన్నింటా ముందు ఉంటున్నారు, ఉద్యోగస్తులు. ఆ వాక్య సూత్రాలు ఇప్పుడెలా వర్తిస్తాయి? నేడున్న సైన్స్, టెక్నాలజీ నాడు లేదు. కాలం మారింది, కాలం చెల్లిన బైబిల్ ఇప్పుడు నాకు ఎలా అక్కరకు వస్తుంది? ఈ తరం క్రైస్తవంలో అలముకున్న కొన్ని అపోహలు, అనుమనాలివి! వాక్యం కంటే లౌక్యాన్ని తలకెక్కించుకున్న క్రైస్తవులకు ఇలాంటి అభిప్రాయాలు కలగడంలో ఆశ్చర్యం లేదు!