క్రైస్తవ విమర్శ

అసలు విమర్శించడమే తప్పు అన్నది కొందరి అభిప్రాయం. “మీరు విమర్శించకండి బ్రదర్!” అని చెప్తుంటారు కొందరు. “విమర్శించకండి…ఎందుకు విమర్శిస్తారు” అనడం కూడా విమర్శనే! విమర్శ అంటే లోతైన ఆలోచన, విశ్లేషణ, పరిశీలన, పరీక్ష, పరిశోధన,… ఇవీ అర్థాలు. అందువల్లనే పునర్విమర్శ, సద్విమర్శ, ఆత్మ విమర్శ, పూర్వ విమర్శ వంటి పదాలు ఎప్పట్నుంచో తెలుగులో వాడుకలో ఉన్నాయి. మానవ జీవితంలో విమర్శ అనివార్యం—అది పర విమర్శ ఐనా, ఆత్మ విమర్శ ఐనా! క్రైస్తవంలో ఇది మరింత సత్యం!

క్రైస్తవ మనస్సాక్షి

మనస్సాక్షి వల్లనే లోకంలో ఇంకా కాస్తయినా మానవత్వం బ్రతికి ఉంది. మనస్సాక్షి వల్లనే ప్రతీ మనిషికీ తప్పొప్పులు తెలుస్తాయి (రోమా 2.14,15). మనస్సాక్షి మనిషికి దేవుడిచ్చిన వరం. నైతికతకు మూలాధారమైన దేవుడు మనిషిని “తన పోలికలో” సృష్టించాడు కాబట్టే సహజంగా మనిషికి నైతిక స్పృహ అబ్బింది. ఆ నైతిక స్పృహను కలిగించే అంతర్గత సామర్థ్యమే “మనస్సాక్షి”.