దేవుడు తీర్చే హృదయ వాంఛ

వాంఛ లేని మనిషి ఉండడు. కాకపోతే అది ఎలాంటి వాంఛ అనేదే ప్రశ్న. ఉన్నదంతా పదార్థ ప్రపంచమే అన్న భౌతికవాద ధోరణి, ఉన్నన్నాళ్ళూ సుఖంలోనే స్వర్గాన్ని వెతుక్కోవాలి అన్న సుఖవాద పోకళ్ళూ, అవసరం ఉన్నా లేకపోయినా మార్కెట్లో కొత్త వస్తువు వస్తే కొని తీరాలి లేకుంటే ప్రతిష్టకు భంగం అన్న వినిమయ తత్త్వమూ, నేనూ లోకంతో పోటీ పడాలి లేకుంటే మనుగడ సాగించలేనన్న అభద్రతా భావమూ కట్టగట్టుకుని ప్రతీ దినం మన మనసుపై దండయాత్ర చేస్తూనే ఉంటాయి. ఇలాంటి లోక మర్యాదకు లోనైన మనస్సు నుంచి పుట్టే వాంఛలను దేవుడు తీరుస్తాడు అనుకోవడం మన అవివేకం.

శాంతి పహరా

శాంతి—ఈ లోకంలో కరువైన విషయాల్లో ఒకటి. డబ్బు హోదా, కులం బలం, పదవి పరపతి ఇవేవీ శాశ్వత శాంతిని ఇవ్వలేవు. సాంకేతికత సుఖాన్నివ్వగలదే గానీ శాంతిని ఇవ్వలేదు. కుబేరులు సైతం శాంతి కోసం అర్రులు చాస్తారు—అది దొరక్క! లోకస్తులు పబ్బులకు, క్లబ్బుకలకు అందుకే వెళ్తుంటారు. అక్కడా అది దొరకదు. మాదకద్రవ్యాల వాడకం, మందు తాగడం కూడా దాని కోసమే. ఐనా శాంతి అందని ద్రాక్షనే!