మే 30, 1431

ఈ రోజు ఫ్రెంచ్ సైనికాధికారి జోన్ ఆఫ్ ఆర్క్ ను పురుష వస్త్రాలు ధరిస్తుందన్న నెపంతో గుంజకు కట్టి సజీవ దహనం చేశారు. 1431 మార్చి నెలలోని విచారణలో ఆమె కేథోలిక సంఘ ఆచారాలను పాటించటం లేదని ఆమెపై మతభ్రష్ట కేసు నమోదు చేసి, ఇకపై ఎప్పుడూ స్త్రీ వేషధారణ లోనే ఉండాలని ఆజ్ఞాపించారు. ఆమె అందుకు ఒప్పుకుంది. ఐతే కొన్ని రోజుల తర్వాత మరల పురుష వేషం వేసిందన్న అభియోగంతో ఆమెను అధికారులకు అప్పగించి, మరణశిక్ష విధించారు.

మే 27, 1564

ఫ్రెంచ్ క్రైస్తవ వేదాంతి, క్రైస్తవ సంఘ సంస్కరణలో అత్యంత కీలక పాత్ర పోషించిన మేధావి, కాల్వినిజంకు ఆద్యుడు జాన్ కాల్విన్ మహిమలోకి ప్రవేశించిన రోజు. దేవుని పనిలో అహర్నిశలు శ్రమించిన కాల్విన్ చివరిగా 1558లో జ్వరంతో అనారోగ్యం పాలయ్యాడు. తన “ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిలీజియన్”ను అనారోగ్యంలోనే పునర్విమర్శ చేసిన కాల్విన్ ఆరోగ్యం క్రమేపీ క్షీణించింది. కొంతకాలం శ్వాసకోశ వ్యాధితో బాధపడ్డ కాల్విన్ చివరికి తన యాభై నాల్గవ ఏట ప్రభువు పిలుపు అందుకున్నాడు. ప్రాటెస్టెన్ట్ క్రైస్తవ ఆలోచన పైన కాల్విన్ చెరగని ముద్ర వేశాడు.