1883 నవంబర్ 9

ఈరోజు భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో పరిచర్య చేసి, ఇతోధిక సేవలు అందించిన మైల్స్ బ్రాన్సన్ గారు ప్రభువు పిలుపు అందుకున్న రోజు (09-11-1883).

అందరికీ మంచి చేద్దాం

క్రైస్తవం స్వార్థ పరాయణత్వంతోనో, మత మౌఢ్యంతోనో ఆవిర్భవించిన విశ్వాసం కాదు. క్రైస్తవం ఇచ్చి వేసుకునే విశ్వాసం. ఆదిమ సంఘంలో విశ్వాసులు తమలోని అక్కర ఉన్న ప్రతి ఒక్కరికీ ఆస్తులను పంచి పెట్టారు(అపో.2.44-45). మన దేవుడు ఇచ్చే దేవుడు, నిలువు దోపిడీ చేసే దేవుడు కాదు. మన దేవుడు లోకాన్ని ప్రేమించి, లోక రక్షణ కోసం తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చివేసిన దేవుడు (యోహా. 3.16). తాను దొంగిలించడానికి రాలేదని, ప్రాణాన్ని పణంగా పెట్టడానికి వచ్చానని, పరిపూర్ణ జీవితాలను ప్రసాదించడానికి వచ్చానని చెప్పారు మన ప్రభువు (యోహా. 10.10-16). ఆయన మన కోసమే కాదు. లోకమంతటి కోసం సిలువలో ప్రాణత్యాగం చేశాడని వాక్యం చెబుతోంది (1 యోహా. 2.2). ఐనా ఎందుకోగానీ, త్యాగపూరిత దాతృత్వం భారతీయ క్రైస్తవులకు ఇంకా అబ్బలేదు. మణిపూర్ బాధితులకు మీరెంత సాయం చేశారు అని మొన్నీమధ్య ఒక ధనిక క్రైస్తవ వర్గాన్ని ప్రశ్నించాను. ఎవరూ జవాబు చెప్పలేదు.