ఆయన సన్నిధిని వెతకండి

“దేవుడి పేరిట చేసే కార్య్రమాల కంటే దేవుడి సన్నిధే ప్రాముఖ్యం”. దేవుడి నామాన్ని రోషంగా ప్రకటిస్తూ, నేటి క్రైస్తవ సంఘ దుస్థితిని ఏడు దశాబ్దాలకు ముందే చెప్పి హెచ్చరించిన దైవజనుడు ఐడెన్ విల్సన్ టోజర్ అన్న మాటలివి. నేటి క్రైస్తవంలో మన కళ్ళెదుట కనబడుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆయన చెప్పిన హెచ్చరికలు మన కోసమే అనిపిస్తుంది. నేటి క్రైస్తవంలో సభల జోరు, సంఘాల్లో కార్యక్రమాల హోరు ఎక్కువయ్యింది. వీటిలో పాల్గొనడమే ఆధ్యాత్మికత అని తలంచే భ్రమలోకి చాలామంది వెళ్ళిపోయారు. చేస్తున్న కార్యక్రమాలు, పెడుతున్న సభలు దేవుని చిత్త ప్రకారమే జరిగిస్తున్నామా, వాటి పైన ఆయన ప్రసన్నత ఉందా అన్న విషయం ఎవ్వరికీ పెద్దగా పట్టట్లేదు. వీటిలో పాల్గొంటే చాలు ఆశీర్వాదం దానంతట అదే వచ్చేస్తుంది అన్నది అనేకుల అపోహ.

క్రీస్తుకు పట్టం కట్టే పరిచర్య

“సెలబ్రిటీ సేవకుల” కాలంలో జీవిస్తున్నాం మనం. వేదికలపైన “దైవ జనులు” సన్మానాలు చేయించుకుని వేడుకలు చేసుకుంటున్న దినాలివి. యూట్యూబ్ లో “లైక్స్” కొట్టించుకుంటూ, వాటికి “ర్యాంకింగ్స్” ఇచ్చుకుంటూ, “బౌన్సర్లను” పెట్టుకుని, కానుకల కాసులతో “దైవ సేవకులు” BMW లలో ఊరేగుతున్న రోజులివి. తాము విమానమెక్కితే వీడియో, “జూ” కెళితే వీడియో, తమ పిల్లలు ఆడినా పాడినా వీడియో. సామాజిక మాధ్యమాల్లో “అంతా మనదే హవా” అన్నదే యావ. పరిచర్య అంటే “మనమూ మన కుటుంబమే” ఇంకెవరూ కనపడకూడదన్న స్వాతిశయ పరాయణత్వం! గొప్పల డప్పులు కొట్టుకుని చిట్టచివర “దేవునికే మహిమ” అంటూ ముక్తాయించే వేషధారణకు ఇపుడు కొదువేమీ లేదు.